World's first medical networking and resource portal

Community Weblogs

Nov16
52 ఏళ్ళ ఆనంద రావు బ్యాంకులో క్లర్క్. కూర్చోని చేసే ఉద్యోగం. బ్యాంకు దగ్గర బండి కిక్కు కొడితే ఇంటి ముందు తేలుతాడు. ఎక్కడికి పోవాలన్నా బైకు మీదే. అలాంటి ఆనంద రావు శరీరంలో పదేళ్ళ నుండి బీపీ, ఆరేళ్ళ నుండి షుగరు సహజీవనం చేస్తున్నాయి. రెండు నెలలకు ఒకసారి డాక్టర్ని కలుస్తాడు. క్రమం తప్పకుండా మందులు వాడుతాడు. డాక్టరు సలహా ప్రకారం తిండిలో ఉప్పు అయితే తగ్గించాడు కానీ తిండిని తగ్గించలేక పోతున్నాడు. తరచూ తిండి ఎక్కువ అవుతుంది. ఆనందం రావు కాస్త తెలివికలవాడు కూడా. పైగా రోగం పట్ల కొత్త డాక్టరు కంటే పాత రోగికి అవగాహన ఎక్కువ అన్న సూక్తిని బాగా ఎరిగిన వాడు. నాలుకను అదుపు చేసుకోలేని ప్రతిసారీ షుగరు పెరగకుండా తిన్న తిండిని బట్టి ఒకటీ, రెండు మాత్రలను అదనంగా వేసుకుంటాడు. ఇలా తన షుగరు పెరగకుండా తనే అదుపు చేసుకుంటున్నానని అనుకుంటాడు. అనుకోవటమే కాదు. షుగరు ఉన్నవారు మితంగా తినబోతుంటే ‘‘అప్పుడప్పుడు ఎక్కువయినా ఏం పరవాలేదులెండి! ఈ రోజుకు కాస్త తినండి. ఓ అర మాత్ర అదనంగా వేసుకుంటే సరిపోతుంది’’ అని సలహా ఇస్తాడు తను కూడా అదే పాటిస్తున్నానని ఎదుటివారికి భరోసా ఇస్తాడు. ************************************************************* ఎక్కడో కొద్ది మంది తప్ప చక్కెర జబ్బు ఉన్న చాలా మంది చాలా సందర్భాలలో ఆనందం రావు లాగే ప్రవర్తిస్తారు. వీరి ఉద్దేశం ఏమిటంటే మాత్ర వేసుకున్నందు వల్ల ఒంట్లో చక్కెర తగ్గుతుందని. ఇందులో నిజం ఎంత? తిని మాత్ర వేసుకునప్పుడు రక్తంలో ఉన్న గ్లూకోజ్ ‘తగ్గు’తుందే కాని అది ‘మాయం’ కాదు. ఒక దగ్గర తగ్గిందంటే అది మర్కెడికో వెళ్ళి ఉంటుంది. మాత్ర లేదా ఇన్సులిను అదనంగా వేసుకున్నందు వల్ల గ్లూకోజ్ తన రూపం మార్చుకుంటుందే తప్ప శరీరంలో నుంచి బయటకు పోదన్న సంగతి తెలుసుకుంటే చక్కెర జబ్బును అదుపులో ఉంచుకోవటం సగం విజయం సాధిచినట్టే. తిన్న తిండి నుండి తయారు అయిన గ్లూకోజు శరీరానికి శక్తిని ఇవ్వటానికి ఉపయోగ పడుతుంది. గ్లూకోజ్ శక్తిగా ఎలా మారుతుందంటే -- గ్లూకోజు ఆక్సిజనుతో కలిసి మండటం (జీవ పరమైన మంట) వల్ల శక్తి విడుదల అవుతుంది. ఎంత ఎక్కువ శక్తి కావాలంటే అంత ఎక్కువ గ్లూకోజ్ మండాలి. ఎక్కువ గ్లూకోజ్ మండాలంటే ఎక్కువ ఆక్సిజను కావాలి. ఎంత ఆక్సిజను కావాలంటే అంతగా లోపలికి గాలి పీల్చాలి. ఎంత ఎక్కువ గ్లూకోజ్ మండితే అంత ఎక్కువ ‘బొగ్గు పులుసు గాలి’ తయారవుతుంది. ఎంత ఎక్కువ గ్లూకోజ్ మండితే అంతగా శరీరం వేడెక్కుతుంది. ఆ వేడిని తగ్గించటానికి చెమట పడుతుంది. ఎంత బొగ్గు పులుసు గాలిని బయటకు పంపాలంటే ఎంత ఎక్కువగా గాలి వదలాలి. ఈ కారణాల వల్లే కష్టం చేసేటప్పుడు ఆక్సిజన్‌ని లోపలకు పీల్చటం కోసం, బొగ్గు పులుసు గాలిని బయటకు వదలటం కోసం ఎక్కువగా రొప్పుతాం. అలాగే శరీరాన్ని చల్లబర్చటం కోసం చెమట ఎక్కువగా పడుతుంది. చేసే కష్టం ఎంత ఎక్కువగా ఉంటే వీటి జోరు అంత ఎక్కువగా ఉంటుంది. వీటి జోరు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా శరీరంలో ఉన్న గ్లూకోజు తగలబడి ఖర్చు అయిపోతుందని అర్థం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇన్సులిను లేదా మాత్రలు వాడినప్పుడు అవి చేసే పనేంటంటే రక్తంలో ఉన్న గ్లూకోజును అక్కడ ఉండనీయకుండా కణాలలోకి తోసిపారేస్తాయి. మామూలుగా అయితే కణాలకు చేరిన గ్లూకోజు శరీరం చేసే శ్రమను బట్టి మండి శక్తిగా మారాలి. అందుకు అవకాశం లేనప్పుడు అదంతా కొవ్వుగా మారుతుంది. ఎక్కువ తిని మాత్ర వేసుకున్నందువల్ల కణాలలోకి అదనంగా చేరిన గ్లూకోజు శ్రమ లేనప్పుడు అంతా కొవ్వుగా మారిపోతుంది. అంటే రూపం మార్చుకుంటుంది. ఇలా జరిగే కొద్ది శరీరంలో కొవ్వు నిలువలు పేరుకుపోయి లావు అవుతారు. లావు కావటం చక్కెర వ్యాధికి మరో ఇబ్బందికరమైన అంశం. కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్థులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తిని గమ్మున కూర్చోని మందులు వేసుకుంటే కొవ్వు పెరుగుతుంది. అలా కాకుండా తిని శ్రమ చేస్తే కణాలకు గ్లూకోజు డిమాండు ఎక్కువ అయి ఉన్న గ్లూకోజును లాక్కొని ఉపయోగించుకుంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర పెరగకుండా అదుపులో ఉంటుంది. వ్యాయామంతో మరికొన్ని ఉపయోగాలు ఏమిటంటే శరీరంలో అదనంగా ఉన్న కొలెస్టరాలును తగ్గిస్తుంది. శరీర అవయవాలకు ముఖ్యంగా కాళ్ళూ, చేతులుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. షుగరు వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా సమస్యలు తలెత్తేది ఈ భాగాలలోనే ఈ భాగాలకు రక్త సరఫరా ఎంత ఎక్కువగా ఉంటే చక్కెర జబ్బువల్ల జరిగే నష్టాలు అంత తక్కువగా ఉంటాయి. వ్యాయామం కొంత మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది పరోక్షంగా (ఒత్తిడి ఎక్కువగా ఉంటే గ్లూకోజు పెరిగి పోతుంది) రక్తంలో గ్లూకోజును తగ్గిస్తుంది. వ్యాయామం మధుమేహాన్ని అదుపులో ఉంచటమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. దాంతో గుండె జబ్బులు, పక్షవాతం లాంటి జబ్బులు దూరంగా జరుగుతాయి. చక్కెర జబ్బు ఉన్నవారు ఆహారం అదుపుతో పాటు వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మధుమేహం ఉన్నవారు సాధారణంగా అందరూ పాటించే వ్యాయామానికి కాస్త భిన్నంగా, కొన్ని జాగ్రత్తలతో చేయాలి. వాటిలో ముఖ్యమైనవి ఇవి. రోజుకు కనీసం అరగంట నుండి గంటపాటు ఒక మోస్తారు ‘నడక, ఎరోబిక్సు) నుండి శరీరం సహకరిస్తే భారీ (షటిలు, టెన్నీసు, స్విమ్మింగ్) వ్యాయామం వరకూ చేసుకోవచ్చు. చేయటం మాత్రం తప్పనిసరి. భారీ వ్యాయామం చేయాలనుకునేవారు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి మీ శరీరం ఏ మేరకు వ్యాయామాన్ని తట్టుకోగలదో అంచనా వేయించుకొని దాని ప్రకారం చేయాలి. చేసే వ్యాయామం కనీసం వారానికి 4, 5 రోజులకు తక్కువ కాకుండా ఉండాలి. కొత్తగా వ్యాయామం మొదలు పెట్టే వారు బూట్లు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. సాక్సు తప్పనిసరిగా వాడాలి లేదంటే బొబ్బలు లేచే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేయబోయే ముందు ఓ అయిదు నిమిషాలు ఒంటిని 'ఉడుకు' (వార్మ్ అప్) పరచాలి. నటవటానికి కాళ్ళు సహకరించనప్పుడు ఈత మంచి వ్యాయామం. ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఒకే వేళకు వ్యాయామం చేయటం మంచిది. షుగరు మాత్రలు, ఇన్సులిను తీసుకొని వ్యాయామం చేయకూడదు. అలాగే ఏమీ తినకుండా వ్యాయామం చేయకూడదు. అలా చేస్తే రక్తంలో గ్లూకోజు తగ్గిపోయి ‘హైపోగ్లయిసేమియా’ అనే స్థితి వచ్చి ఇబ్బంది పడిపోతారు. తిన్న రెండు గంటల తరువాత వ్యాయామం చేయటం ఉత్తమం. ఇది కాక రోజువారీ వ్యవహారంలో నడకను ఎక్కువగా ఉపయోగించాలి. మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్నప్పుడు మెట్లు ఉపయోగించటం మంచిది. వ్యాయామం చేయటానికి వీలు కాని వారు అవసరం మేరకు, తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం ద్వారా ఉన్నంతలో జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు ఆరోగ్యం, వైద్యం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రవర్తనకు సంబంధించిన అంశాలలో మీకు సందేహాలుంటే అడగవచ్చు. ప్రతి బుధవారం ఆంద్రభూమి దిన పత్ర్హిక "సంజీవని"లో సమాధానాలు ఇస్తాను. వ్యక్తిగతంగా, ఉత్తరాల ద్వారా, ఈ -మెయిల్ ద్వారా సమాధానాలు ఇవ్వటం కుదరదు. దయచేసి మన్నించండి చిరునామా: డా. పి. శ్రీనివాస తేజ సైకియాట్రిస్టు మైండ్‌ కేర్ హాస్పిటల్, పొగతోట నెల్లూరు - 524001 ఆంద్ర భూమి మీకు "వల"లో అందుబాటులో ఉంది http://www.dc-epaper.com/andhrabhoomi http://www.andhrabhoomi.net/sanjeevani


Comments (0)  |   Category (Diabetology)  |   Views (3542)

Community Comments
User Rating
Rate It


Post your comments

 
Browse Archive