World's first medical networking and resource portal

Community Weblogs

Nov16
సున్నిత మనసు, జాలిగుండె ఉన్న వ్యక్తులు పోలీసులుగా రాణించలేరు. అలాగే జాలి గుండె లేకుండా కఠినంగా వ్యవహరించే వారు వైద్యులుగా పనికిరారు. తిమ్మిని బమ్మిగా చేయలేని వారు లాయర్లుగా చలామణి కారు. వృత్తిలోకి ప్రవేవించక ముందు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు కానీ, ఆయా పనుల్లో కుదురుకున్నాక పాత ప్రవర్తనను పక్కన పెట్టి వృత్తికి సరిపోయిన ప్రవర్తనని అలవరుచుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఈ సూత్రం వృత్తులకే కాదు జబ్బులకు కూడా వర్తిస్తుంది. ఆరోగ్యం ఉన్నంత వరకూ ఎన్ని ఆటలు ఆడినా, ఎంత విచ్చల విడిగా ప్రవర్తించినా చెల్లుతుంది. కానీ జబ్బున పడ్డాక అది తగ్గటానికీ, లేదా అదుపులో ఉంచడానికి ‘అనుకూల ప్రవర్తన’ను అలవరచుకోకుండా కేవలం మందులతోనే వైద్యం చేయించుకుంటే ఉపయోగం ఉండదు. రోగం వచ్చాక ఖచ్చితంగా ప్రవర్తన మార్చుకోవాల్సిన జబ్బుల్లో చక్కెర వ్యాధి లేదా మధుమేహం ఒకటి. *************************************************** చక్కర జబ్బు రావటమే తప్ప నయం కావటం ఉండదు. జీవితాంతం వ్యక్తితో సహా జీవనం చేస్తుంది. కాబట్టి జబ్బు కనపడ్డప్పటి నుండి జీవితాంతం దాన్ని పట్టించుకోవాలి. పట్టించుకోవాలంటే దాన్ని గురించి తెలుసుకోవాలి. మనం తినే తిండిలో ప్రధానంగా ఒంటికి చేరేవి పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీనులు), నూనె పదార్థాలు (లిపిడ్లు), మిగిలినదంతా పీచు (ఫైబరు). తినే తిండిలో ఉన్న ‘పిండి పదార్థాలు’ అరిగి చివరికి గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఇది శరీరంలో ఉన్న ప్రతీ కణానికి చేరి శక్తి పుట్టటానికి కావల్సిన సరుకుగా ఉపయోగపడుతుంది. శరీరంలో తయారయ్యే గ్లూకోజు శరీర అవసరాలకు పోను మిగిలినది గ్లయికోజనుగా, కొవ్వుగా మారి నిలువ ఉంటుంది. శరీర అవసరాలకు శరీరంలో 100 మిల్లీ లీటర్ల రక్తంలో 80 నుండి గరిష్టంగా 180 మిల్లీ గ్రాముల గ్లూకోజు ఉండాలి. అంతకు మించి ఉంటే దాన్ని ఇతర రూపంలోకి మార్చి రక్తంలో గ్లూకోజును తగ్గించే పనిని ‘ఇన్సులిను’ అనే హార్మోను చేస్తుంది. ఏ కారణం వల్లనైనా శరీరంలో ఇన్సులిను ఊరటం తగ్గినా లేదా ఇన్సులిను ఉనా దానికి కణాలు స్పందించక పోయినా రక్తంలో గ్లూకోజు నిలువలు పేరుకుపోతాయి. అలా పేరుకు పోయిన నిలువలు శరీరంలో దాదాపు అన్ని భాగాలను పాడు చేస్తుంది. ముఖ్యంగా కళ్లు, నరాలు, గుండె, కిడ్నీలు పాడవుతాయి. మధుమేహం వచ్చాక రక్తంలో గ్లూకోజు స్థాయిని శరీరం దానంతట అది అదుపు చేసుకోలేదు కాబట్టి బైట నుండి మనమే అదుపు చేయాలి. అలా అదుపు చేయాలంటే మధుమేహానికి తగ్గట్టు జీవన విధానాన్ని మార్చుకోవాలి. అదే ‘డయాబెటిక్ జీవన విధానం’. ఇందులో మందుల వాడకం ద్వారా చక్కెరను అదుపులో పెట్టుకోవటం కేవలం పావలా వంతే. వాటి సంగతి డాక్టర్లు చూసుకుంటారు. మిగిలిన ముప్పాయి భాగం ప్రవర్తనను మార్చుకోవటం ద్వారా అదుపులో ఉంచుకోవాలి. అంటే జీవన శైలిని మార్చుకోవాలి. చక్కెర జబ్బు వచ్చినప్పుడు మార్చుకోవాల్సిన జీవన శైలి మూడు మూల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అదనపు కేలరీలను శరీరంలోకి పోకుండా ‘తిండి’ మీద అదుపు. తిన్న తిండి నిలువలుగా పేరుకు పోకుండా ‘శ్రమ’ చేయటం ద్వారా ఖర్చు చేయటం. అప్పటికీ అదుపు కాకపోతే చివరి ప్రయత్నంగా ‘మందులు’ వాడుకోవటం. తిండి విషయానికి వస్తే ఎప్పుడు తినాలి? ఎంత తినాలా? ఏమి తినాలి? ఎలా తినాలి? అనేది తెలుసుకొని ఉండాలి. తెలుసుకుంటే సరిపోదు. దాని ప్రకారం నడుచుకోవాలి. చక్కెర వ్యాధిగ్రస్తులు అందరిలాగా మూడు పూట్లా తింటే కుదరదు. తినటం ద్వారా శరీరంలోకి చేరిన గ్లూకోజును తొలగించే ఇన్సులిను తగినంతగా లేనందువల్ల తీవ్రతను బట్టి గ్లూకోజు నిలువలు పేరుకు పోతాయి. అలా పేరుకుపోకుండా కావల్సిన మేరకు ఉండాలంటే శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. గతంలో మాదిరి ఎంతంటే అంత తినటానికి లేదు. తినే తిండి నాలుగు గంటలకు సరిపోయేతంగా ఉండాలి. తిన్నది అయిపోయే లోపల మళ్లీ తినాలి. ఇలా ప్రతి నాలుగు గంటల వ్యవధిలో తింటూ ఉండాలి. దీనినే మరో మాటలో చెప్పాలంటే మామూలుగా తినే తిండినే కొద్ది కొద్దిగా విభజించుకొని ఎక్కువ సార్లు తినాలి. అలా చూసినప్పుడు చక్కెర వ్యాధిగ్రస్తులు ఈ విధంగా తినాలి పొద్దున 6 గంటలకు - కాఫీ, స్నాక్సు పొద్దెక్కి 10 గంటలకు - టిఫిను మధ్యాహ్నం 2 గంటలకు - భోజనం (లంచ్) సాయంత్రం 6 గంటలకు - స్నాక్సు లేదా టిఫను రాత్రి 10 గంటలకు - భోజనం (డిన్నర్) రాత్రి 10 నుండి తెల్లవారి 6 గంటల వరకూ అంటే నిద్రకు కేటాయించిన 8 గంటల సమయంలో మధ్యలో 12 గంటలకు లేచి తినటం వీలు కాదు కాబట్టి రాత్రి తిండిని ‘చక్కెర గుణకం’ ప్రకారం తింటే అటు నిద్రకు ఇబ్బంది లేకుండా చూసుకోవటంతో పాటు ఇటు గ్లూకోజుపై అదుపు కూడా సాధించవచ్చు. తినే ఆహార పదార్థాలు, వాటి తయారీ పద్ధతులను బట్టి కొన్ని త్వరగా గ్లూకోజుగా మారి రక్తంలో కలిస్తే మరికొన్ని చాలా నిదానంగా రక్తంలోకి చేరుతాయి. ఏ పదార్థం ఎంత సేపటిలో గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుందో దాన్ని "చక్కెర గుణకం" (Glycemic index or GI ) అంటారు. పొట్లాలలో దొరికే గ్లూకోజు పొడిని తాగితే వెంటనే రక్తంలోకి చేరి పోతుంది. కాబట్టి గ్లూకోజు చక్కెర గుణకాన్ని 100 గా తీసుకొని దాన్ని పడికట్టుగా ఉంచి మిగతా ఆహార పదార్థాలు దానికంటే ఎంత ఆలస్యంగా కలుస్తాయో పోలుస్తారు. చక్కెర గుణకం ప్రకారం ఆహారాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు GI : 100 నుండి 70 మధ్యన ఉండేవి - త్వరగా కలుస్తాయి ఉదా: గ్లూకోజు GI : 69 నుండి 56 మధ్యన ఉండేవి - నిదానంగా కలుస్తాయి ఉదా: అన్నం, ప్రాసెసు చెయ్యని గోధుమ ఉత్పత్తులు, చిలగడ దుంప, పంచదార, GI : 55 కంటే తక్కువ ఉండేవి మరీ ఆలస్యంగా కలుస్తాయి. ఉదా. బంగాళ దుంప, పుచ్చకాయ మినహాయించి మిగిలిన పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్డు, దంపుడు బియ్యం. రాత్రి తినే ఆహారంలో ఈ మూడు సమపాళ్లల్లో ఉండే విధంగా ‘మెను’ తయారు చేసుకొని తింటే వాటి వాటి చక్కెర గుణకం ప్రకారం విడదలు విడతలుగా రక్తంలో కలుస్తుంటాయి. దీనితో రాత్రి 8 గంటల పాటు రక్తపు గ్లూకోజులో పెద్ద తేడా రాదు. దీనికి తోడు పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే ఆహారం జీర్ణం కావటంలో కొంత ఆలస్యం కావటంవల్ల గ్లూకోజు త్వరగా రక్తంలో చేరటాన్ని అపుతుంది. ఇలా చెయ్యటానికి కాస్త కష్టంలా అనిపిస్తుంది. కానీ అర్హత పొందిన పోషక నిపుణులను కలిస్తే రోజువారీగా తినే ఆహారంలోనే కొంచెం మార్పులు చేయటం ద్వారా నిద్రకు అనుకూలమయిన ‘మెను’ తయారు చేసి ఇస్తారు. ఎంత తినాలి అనేందుకు పరిమితులు లేవు. వారు గతంలో ఎంత తిండి తింటున్నారో అంత తిండి తినవచ్చు. చక్కెర జబ్బు వచ్చిందనగానే చాలా మంది తినంటం తగ్గించేస్తారు. అదనంగా బరువు ఉండి తగ్గాలనుకుంటే తప్ప తగ్గించాల్సిన అవసరం లేదు. ఆ తగ్గించేది కూడా రోజువారీ తిండిలో 5 నుండి 10 శాతం కోత పెట్టి తినొచ్చు. చక్కెర జబ్బు వచ్చిన వారికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏమిటంటే తినచ్చు. ఏమేమి తినకూడదు అని. చక్కెర జబ్బు వచ్చిన వారు నాలుగు గంటల వ్యవధిలో కొద్ది కొద్దిగా ఏమైనా తినవచ్చు. ఉదాహరణకు తిరుపతి వెంకన్న లడ్డును మామూలు వారు అయితే ఒకేసారి తింటే చక్కెర వ్యాధిగ్రస్తులు అదే లడ్డూను రోజులో అయిదు సార్లుగా తినవచ్చు. ఉన్న ఒకే ఒక షరతు ఏమిటంటే లడ్డూకు మోయనం మిగతా తిండి తగ్గించాలి. అంతే. తినే ఆహార పదార్థాల ‘చక్కెర గుణకం’పై కాస్త అవగాహన ఉంటే ఎలా తినాలి? అనేది అసలు సమస్యే కాదు. వీటిని గురించిన వివరాలు వైద్యం చేస్తున్న డాక్టరును లేదా పోషక నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్టులో ‘“Glycemic index” అని ‘‘వెతుకు మర’’లో కొడితే బోలెడు ‘చోటు'ల్లో ఈ సమాచారం దొరుకుతుంది. మధుమేహం వచ్చాక దానిపట్ల అవగాహన పెంచుకొని, జీవన సరళిని మార్చుకుంటే అది ఇంటిలో ఉండే బొచ్చు కుక్కలా పడి ఉంటుంది. దానిపాటికి దాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే అది పిచ్చి కుక్కలా వెంటాడుతుంది. * ----------------------- ఆరోగ్యం, వైద్యం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రవర్తనకు సంబంధించిన అంశాలలో మీకు సందేహాలుంటే అడగవచ్చు. ప్రతి బుధవారం ఆంద్రభూమి దిన పత్ర్హిక "సంజీవని"లో సమాధానాలు ఇస్తాను. వ్యక్తిగతంగా, ఉత్తరాల ద్వారా, ఈ -మెయిల్ ద్వారా సమాధానాలు ఇవ్వటం కుదరదు. దయచేసి మన్నించండి చిరునామా: డా. పి. శ్రీనివాస తేజ సైకియాట్రిస్టు మైండ్‌ కేర్ హాస్పిటల్, పొగతోట నెల్లూరు - 524001 ఆంద్ర భూమి మీకు "వల"లో అందుబాటులో ఉంది http://www.dc-epaper.com/andhrabhoomi http://www.andhrabhoomi.net/sanjeevani


Comments (0)  |   Category (Diabetology)  |   Views (3060)

Community Comments
User Rating
Rate It


Post your comments

 
Browse Archive